Saturday 13 August 2011

పసి పిల్లలు---ఆ మాట వినగానే ఎన్నో బోసి నవ్వులు కళ్ళ ముందు కదలాడి మనసును సేద తీరుస్తాయి.అలాంటి పిల్లలు ఉగ్రవాదానికి,కుటుంబ,మత కలహాలకి,కొందరు స్వయంగా తమ తల్లిదండ్రులు చేసిన తప్పులకు బలవుతున్నారు.కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తండ్రి ఈ లోకానికి దూరమైతే,ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లుతుందో,ఎంత కలవరపడుతుందో తలచుకుంటేనే కళ్ళు చెమర్చుతాయి.ఇక తల్లిని కోల్పోయిన పిల్లలైతే,ఒక రకంగా చెప్పాలంటే సర్వస్వం కోల్పోయినట్టే ఉంటుంది---ఆ లేత మనసుకు చనిపోవడమంటే అర్థం కూడా తెలీదు.ఆ  పిల్లలను పెంచి,చదివించే బాధ్యత ఒక్క తల్లి మీద పడుతుంది...ఆ కష్టం పగవారికి కూడా రాకూడదు.ఇలాంటి హృదయవిదారకమైన కథలు...నిజమైన కథలు ఎన్నో చూస్తుంటాం.
             ఇక వృద్ధులు---జీవితపు అంచులకు చేరువై గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడిపేయలనుకుంటారు.ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ తమ పిల్లలను వృద్ధిలోకి తీసుకువచ్చి చివరకు వృద్ధాప్యపు ఒడిని చేరుకుంటారు.జీవితంలోని ఆఖరి దశను తమ పిల్లలతో,మనవలు,మనవరాళ్ళతో గడపాలని కొండంత ఆశతో ఉంటారు.కన్నబిడ్డలు ఆదరించక బాధపడేవారు కొందరైతే,సమాజంలోని కుళ్ళు,కుతంత్రాలకు సాక్ష్యాలుగా నిలిచిన తమ పిల్లల మరణాలతో కుంగిపోయేవారు మరి కొందరు.ఇలాంటి కలవరపరిచే విషయాలను గురించి కూడా మనం వింటూ ఉంటాం...బాధపడుతుంటాం.....
            ఇలాంటి అభాగ్యులను అక్కున చేర్చుకుంటోంది ఒక సంస్థ---"సృష్టి".నిజానికి దాన్ని సంస్థ అనేకంటే కుటుంబం అంటే సరిగ్గా సరిపోతుంది.ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆప్యాయత దొరుకుతుంది,పిల్లలు దూరం చేసుకున్న తల్లిదండ్రులకి ఆదరణ లభిస్తుంది.పిల్లలు చదువుకుని వృద్ధిలోకి వస్తారు. పెద్దవారు తమ శక్తి ఉన్నంతవరకూ పని చేయడానికి ఉపాధిని కల్పిస్తున్నారు.ఎన్నో జీవితాలు అర్థవంతమౌతాయి.....
            మనం ఎన్నో అనుకుంటాం,ఎంతో బాధపడతాం వీరి గురించి,కాని ఏమీ చేయలేని స్థితి.ఎక్కడ నుండి సహాయాన్ని మొదలుపెట్టాలో తెలియదు,ఎలా చేస్తే అది వారికి ఉపయోగపడుతుందో తెలిదు.వారి భవిష్యత్తు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం---అది మన ఆశ.దానితోపాటు చేతనైన సహాయాన్ని వారికి అందించాలి---ఇది మన బాధ్యత,మానవత్వం.
            "సృష్టి"ని వెలుగులోకి తీసుకుని వద్దాం.....ప్రపంచాన్ని కాకపోయినా కనీసం మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రగతి బాట పట్టిద్దాం.....